దర్బార్ సినిమా రివ్యూ

0
14

దర్బార్

కథ విషయానికొస్తే ‘అనగా అనగా పూర్వం…’ అని మొదలెట్టాలి. అంత పాత కథ. సినిమా మొదలవ్వడమే ఫ్లాష్ బ్యాక్‌తో మొదలవుతుంది. చాలావరకు ఫ్లాష్ బ్యాకే ఉంటుంది. వరుసగా ఎన్‌కౌంటర్లు చేస్తున్న అరుణాచలాన్ని హూమన్ రైట్స్ కమిషన్ నిలదీస్తుంది. అతని ప్రవర్తనకి కారణమేంటో చెబుతూ సినిమా మొదలవుతుంది.

సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ వంకపెట్టడానికేమీ లేదు. అనిరుధ్ స్వరపరచిన పాటలు, నేపథ్య సంగీతం ఇంతకుముందు విన్నట్టుగానే అనిపిస్తాయి. రజనీకాంత్ పాత సినిమా అరుణాచలంలోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొంత రిపీట్ చేసినట్టు అనిపిస్తుంది. పాటలు తొందరగా అయిపోతే బాగుండునని ఒకటి రెండుసార్లు అనిపించినా ఆశ్చర్యం లేదు. చంద్రముఖిని గుర్తు చేస్తూ రజనీ, నయనతారల మధ్య ఒక పాట, బాషా, నరసింహలను గుర్తు చేస్తూ మరో రెండు పాటల పిక్చరైజేషన్ ఉంది.

కాలా, కబాలీ అని రజనీకాంత్ ఒక అడుగు అటు పెట్టారు. నడక సరిగ్గా కుదరలేదేమో! మళ్లీ అడుగు వెనక్కి తీసేసుకుని తన సూపర్‌స్టార్ ఇమేజ్ పంథాలోనే మరో సినిమా చేశారు. నటన విషయానికొస్తే రజనీ స్టైల్ మేరు పర్వతం. చూడ్డానికి కన్నులపండుగగా ఉంటుంది. శరీరంలో వయసు తెలుస్తున్నా ఉత్సాహంలో మాత్రం యువకుడే! రజనీకాంత్ స్టైల్ మాత్రమే చూడాలనుకుంటే ఈ సినిమాకి తప్పకుండా వెళ్లొచ్చు.

మిగతా నటులందరికి పెద్దగా నటనకు అవకాశం రాలేదు కానీ విలన్‌గా బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి నటన ఉన్న కాసేపూ ఆకట్టుకుంది. సినిమా చివరికొచ్చేసరికి తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఠాగూర్, గజినీ లాంటి సినిమాలు తీసి సూపర్ హిట్ చేసిన మురుగదాసు ఏమైపోయారా అని ఆశ్చర్యం కలుగక మానదు! అయితే, ఈ సినిమాకి దర్బార్ అని పేరెందుకు పెట్టినట్టు అనే సందేహం మాత్రం బయటకొచ్చే ప్రతి ప్రేక్షకుడికీ కలగకమానదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here