ప్రముఖ కార్ల తయారీ దిగ్గజాలు ఇప్పుడు విద్యుత్ సాయంతో నడిచే కార్లపై దృష్టి సారించాయి. దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ కూడా ‘కోనా’ పేరుతో ఎలక్ట్రిక్ కారు రూపొందించింది. తాజాగా ‘కోనా’ కారు గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తుకు ప్రయాణించిన వాహనంగా ‘కోనా’ సరికొత్త రికార్డు సృష్టించింది. టిబెట్ లోని సవులా పర్వతాల్లో 5,731 మీటర్ల ఎత్తుకు ప్రయాణించిన ‘కోనా’ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో స్థానం సంపాదించింది.
కనీసం 9 గంటలు నిద్రించే వారు ఆరోగ్యంగా బ్రిటన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే ఆ మరుసటి రోజు సరిగ్గా పని చేయలేం. కంటి నిండా నిద్రపోతే ఉత్సాహంగా పనులు చేసుకుంటాం. ఇందుకు గల కారణాలను గుర్తించిన పరిశోధకులు కంటినిండా నిద్రపోతే శారీరక ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు.
రోజూ రాత్రి 8 గంటలకు నిద్రపోయి, ఉదయం 5 గంటల్లోపు నిద్రలేచే (9 గంటలు నిద్ర) వారి శరీర కణజాలాల్లో కొలాజెన్ అనే ప్రొటీన్లు అత్యంత క్రియాశీలంగా ఉంటున్నట్లు బ్రిటన్లోని మాంఛెస్టర్ వర్సిటీ పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు. జీవగడియారం ప్రకారం నిద్రిస్తే కండరాలు, ఎముకలు, చర్మంలోని కణ జాలాల్లో నిర్మాణాత్మక, రసాయనిక చర్యలు గతి తప్పకుండా జరుగుతాయని, దీంతో ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పారు.
ఖగేంద్ర మృతి – 2.4 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అతి పొట్టి మనిషిగా గుర్తింపు
ప్రపంచంలోనే అతి పొట్టి మనిషిగా పేరుపొందిన 27ఏళ్ల ఖగేంద్ర థాప మగర్ నిన్న రాత్రి మరణించాడు. నేపాల్ కు చెందిన ఖగేంద్ర కేవలం 2.4 అడుగుల ఎత్తు మాత్రమే ఎదిగాడు. ఇతను గత కొంత కాలంగా న్యూమోనియాతో బాధపడుతున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖగేంద్రకు నిన్న రాత్రి తీవ్రంగా గుండెపోటు రావడంతో మరణించాడని సోదరుడు మహేష్ థాప మగర్ తెలిపాడు. 2010లో ఖగేంద్ర తన 18వ ఏట ప్రపంచంలోనే అతి పొట్టి మనిషిగా గుర్తింపు పొంది ‘గిన్నిస్’ సర్టిఫికేట్ అందుకున్నాడు. అదే సంవత్సరం జరిగిన నేపాల్ భామల అందాల పోటీలో హల్చల్ చేసి విజేతలతో ఫొటోలకు పోజిచ్చాడు. ఖగేంద్ర నేపాల్ పర్యాటక శాఖకు అధికారిక ప్రచారకర్తగా పనిచేశాడు.
పొత్తుతో నాదెండ్లకు కేంద్ర మంత్రి పదవి ?
పవన్ కళ్యాణ్ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నూతన పొత్తుకు తెరతీశారు. దాని ప్రభావం ఉంటుందా.. ఉండదా అనేది పక్కకు పెడితే… ఒక నూతన రాజకీయ సమీకరణం అని మాత్రం చెప్పక తప్పదు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు తొలిసారి రాజకీయ వేదికపైకెక్కిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత స్తబ్దుగా మారిపోయాడు. 2014 ఎన్నికలకు ముందు, తాను ఒక పార్టీ పెడుతున్నట్టు చెప్పుకొచ్చాడు. జనసేన ఆవిర్భావం కూడా జరిగింది. పవన్ ఇజం అనే ఒక పుస్తకాన్ని కూడా ఆవిష్కరించాడు. ఆతరువాత కొన్ని రోజుల్లో ఉన్న ఎన్నికలకు పార్టీ అప్పుడే సిద్ధంగా లేనందున టీడీపీ-బీజేపీ కూటమికి తన మద్దతు ప్రకటించి, ఆ కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నించాడు. ఏ సమస్య మీదైనా ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్, ఆ తరువాత రాజకీయ చిత్రపటంపైన కనబడ లేదు. పవన్ పార్ట్ టైం రాజకీయ నాయకుడంటూ అప్పటి ప్రతిపక్ష వైసీపీ ఎద్దేవా కూడా చేసింది. ఇక మధ్యలో అడపాదడపా ఉద్యమాలు చేసినా, ఆ ఫ్లోని మాత్రం కంటిన్యూ చేయలేకపోయాడు.
అమరావతి కోసం మళ్లీ జోలె పట్టిన చంద్రబాబు
అమరావతి కోసం చంద్రబాబు మరోసారి జోలె పడుతున్నారు . రాజధాని ప్రాంత రైతులు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు . ఈ మేరకు ఉద్యమాలు చేస్తున్నారు . వారికి చంద్రబాబు మద్దతు తెలుపుతున్నారు . వారి పోరాటం కోసం ఆయన జోలె పట్టుకుని ఊరూరా తిరుగుతూ విరాళాలు పోగు చేస్తున్నారు . అయితే ఈ జోలె విరాళాలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు .
మరి రాయలసీమ ప్రజల సంగతి ఏంటి
రాజధాని అంశం రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. కానీ మీడియాకు అభిప్రాయాలు ఉండకూడదు. అన్ని అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. తమ అభిప్రాయాలను ఎడిటోరియల్ లో చెప్పవచ్చు. ప్రపంచానికి నీతులు చెప్పే తెలుగు మీడియా తాను మాత్రం అందుకు అతీతం అన్నట్లు వ్యవహారిస్తుంది. మూడు రాజధానుల ప్రతిపాదనను ముఖ్యమంత్రి చేసిన వెంటనే అమరావతి ప్రజలు ఆందోళన చేపట్టారు. వారి డిమాండుతో విభేదించే వారు కూడా వారి ప్రజాస్వామిక హక్కును కాదనలేరు.
మీడియా కూడా వారి ఆందోళనను ప్రపంచం ముందు ఉంచుతుంది. అంత వరకు బాగానే ఉంది. కానీ రాష్ట్రంలో భాగమైన రాయలసీమ ప్రజల ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అందుకు మంచి ఉదాహరణ వెలుగులోకి రాని సీమలోని ఆందోళన కార్యక్రమాలు. కడప కేంద్రంగా నాలుగు రాయలసీమ జిల్లాల ప్రజలు వందల మంది పార్టీల కతీతంగా ముఖ్యమంత్రి ప్రతిపాదనలో రాయలసీమకు సమన్యాయం కావాలని సీమ సంకల్ప దీక్ష చేస్తున్నారు. కానీ ఒక్క మీడియా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రధాన అంశంగా చర్చ చేయలేదు.
సినీనటి రష్మికకు ఆదాయ పన్నుల శాఖ నోటీసులు
సినీనటి రష్మిక మందన్నకు ఆదాయ పన్నుల శాఖ నోటీసులు పంపింది. కర్ణాటకలోని ఆమె స్వస్థలం విరాజ్పేటెలోని నివాసంలో గురువారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటితో పాటు రష్మిక కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న కల్యాణ మండపంలో జరిపిన తనిఖీల్లో రూ.25 లక్షల నగదుతో పాటు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు సంబంధించిన పత్రాలు రష్మిక తల్లిదండ్రులు చూపలేదు. ఈ నెల 21న బెంగళూరు, మైసూరు కార్యాలయాల్లో హాజరై వీటి వివరాలు అందించాలని రష్మికకు నోటీసులు జారీ చేశారు.