నకిలీ కస్టమర కేర్‌ నంబర్లతో మోసాలు …..బాధితుడి నుంచి రూ. 70వేలు తస్కరణ

0
109

నకిలీ కస్టమర కేర్‌ నంబర్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. వివిధ సంస్థల పేరిట నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబర్లను మోసగాళ్లు గూగుల్‌లో ఉంచుతున్నారని, తమ సమస్యలపై ఎవరైనా సంప్రదిస్తే మోసగాళ్లు మాటల్లో దించి డెబిట్‌ కార్డులు, యూపీఐ నంబర్లు సహా ఓటీపీలు తీసుకుని ఖాతాలు ఖాళీ చేస్తున్నారని వారు వివరించారు.

ఆన్‌లైన్‌ కొనుగోళ్లు, ఆహార యాప్‌ సంస్థలకు ఆర్డర్‌లు తదితర లావాదేవీల్లో సమస్యలు తలెత్తినపుడు వినియోగదారులు ఆయా సంస్థల కస్టమర్‌ కేర్‌ కేంద్రాలకు సంప్రదిస్తారు. కస్టమర్‌ కేర్‌ ఫోన్‌ నంబర్లను గూగుల్‌లో శోధిస్తారు. ఆ అవసరాలనే ఆసరాగా చేసుకుని మోసగాళ్లు ఆయా సంస్థల పేరిట వెబ్‌సైట్లు సృష్టించి కస్టమర్‌ కేర్‌ నంబర్లంటూ కొన్ని ఫోన్‌ నంబర్లు ఉంచుతున్నారు. వినియోగదారులు సమస్యలపై ఆయా నంబర్లకు ఫోన్‌ చేయగానే ఉచ్చులోకి దించి బాధితుల ఖాతా నంబరు సహా డెబిట్‌ కార్డు, సీవీవీ నంబర్లు, చివరికి ఓటీపీలు, యూపీఐ పిన్‌ నంబర్లు తదితరాలు తీసుకుని ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఇటీవల నగరానికి చెందిన ఓ బాధితుడు జొమాటోకు ఆర్డర్‌ చేసి రూ. 200 విలువైన ఆహారం తెప్పించుకున్నారు. అందులో దుర్వాసన రావడంతో సదరు సంస్థకు ఫిర్యాదు చేసేందుకు గూగుల్‌లో శోధించి కస్టమర్‌ కేర్‌ నంబరు తీసుకున్నారు. ఆ నంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసి తన డబ్బులు తిరిగి చెల్లించాలని కోరారు. ఫోన్‌లో కస్టమర్‌ కేర్‌ ప్రతినిధినంటూ పరిచయం చేసుకున్న వ్యక్తి.. ఖాతా నంబరు, యూపీఐ పిన్‌ నంబరు తదితర వివరాలు పంపించాలని, డబ్బులు తిరిగి చెల్లిస్తామని సూచించాడు. బాధితుడు వివరాలు పంపించగానే ఆయన ఖాతా నుంచి క్షణాల్లో రూ.70వేలు మాయమయ్యాయి. బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజూ ఈ తరహా కేసులు చాలా నమోదవుతున్నాయని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం ఏసీపీ శ్రీనివాస్‌కుమార్‌ చెప్పారు.

 

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here